ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి
2వ వార్డులో సమస్యలు పరిష్కరిస్తా
చేర్యాల మునిసపల్ 2వ వార్డు అభ్యర్థి గీతాంజలి హామీ
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ రెండో వార్డు అభ్యర్థి కమలాపురం గీతాంజలి ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. బుధవారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె, కాలనీల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, “నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తాను. ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయండి” అని ఓటర్లను కోరారు. అవకాశం కోసం మాత్రమే వచ్చే వారిని నమ్మి మోసపోవద్దని, తనను గెలిపిస్తే ఏడాది లోపే డ్రెయినేజీ, రహదారులు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని గీతాంజలి విమర్శించారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిందని ఆరోపించారు. ప్రజలు బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని, చేర్యాల మున్సిపాలిటీలో ఈసారి బీఆర్‌ఎస్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రచారంలో భావోద్వేగ దృశ్యం
ఎన్నికల ప్రచారంలో భాగంగా గీతాంజలి ఒక వృద్ధుడి వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించినప్పుడు భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, కుటుంబ కష్టాలను ఎదుర్కొన్న గీతాంజలిని చూసి చందా బాలయ్య అనే వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. “ఎప్పుడూ గీతమ్మా” అంటూ ప్రేమగా పిలిచే బాలయ్య భావోద్వేగానికి లోనవ్వడంతో గీతాంజలి కూడా కన్నీరు పెట్టుకున్నారు. తనకు వార్డు ప్రజలే కుటుంబమని, ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.


