బీజేపీ విజయఢంకా!
వరంగల్ జిల్లాలో ఉనికి చాటిన కమలదళం
బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం సంతోషం
: బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్
కాకతీయ, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కీలక గ్రామాల్లో విజయం సాధించి పార్టీ బలాన్ని చాటారు. ఐనవోలు మండలంలోని పంతిని గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కన్నయ్య గెలుపొందగా, నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో ఓరుగంటి మాధురి రాజు, హాసన్‌పర్తి మండలంలోని పెంబర్తి గ్రామంలో తాళ్లపెల్లి కుమారస్వామి సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. పంతిని గ్రామంలో విజయం సాధించిన సర్పంచ్ కన్నయ్యతో పాటు వార్డు సభ్యులకు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకుల కృషిని ఆయన అభినందించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించారని పార్టీ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో నాయకులు సఫలమయ్యారని, అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిభ, చరిష్మ కూడా విజయానికి తోడైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ విధానాల పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు విజయం సాధించడం సంతోషకరమన్నారు. ప్రధాని నరేంద్రమోదీతోనే దేశ ప్రగతి సాధ్యమని పల్లె ప్రజలు గుర్తించారని, అందుకే బీజేపీకి విజయాన్ని అందించారన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న అన్ని ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.


