తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం
బీజేపీ నాయకుడు దేవకీ వాసుదేవరావు
కాకతీయ, ఖమ్మం : కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆకాంక్షలను భారతీయ జనతా పార్టీ మాత్రమే నెరవేర్చగలదనే స్పష్టమైన తీర్పును మరోసారి వెల్లడించాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా పేరున్న తిరువనంతపురం నగరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మొత్తం 101 వార్డులకు గాను 50 వార్డుల్లో ఘన విజయం సాధించడమే కాకుండా మేయర్ పీఠాన్ని కూడా చేజిక్కించుకునే స్థితికి చేరిందని పేర్కొన్నారు. వామపక్ష ఎల్‌డీఎఫ్ కూటమి కేవలం 29 స్థానాలకు పరిమితమవ్వగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందని తెలిపారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారని వివరించారు. అలాగే యూడీఎఫ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా పాలక్కడ్ మున్సిపాలిటీలో కూడా బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ ఫలితాలు ప్రజలు బీజేపీ వైపే నిలిచారని, కమ్యూనిస్టు పార్టీల ఏకపక్ష పాలన విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా చాటుతున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా కమ్యూనిస్టు పోకడలను ప్రజలు గమనిస్తున్నారని, అతి త్వరలోనే ఇక్కడ కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని దేవకీ వాసుదేవరావు విశ్వాసం వ్యక్తం చేశారు.


