- పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాప సీతయ్య
కాకతీయ, బయ్యారం : బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో ముందు వరుసలో ఉంటుందని, మోడీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలను ఆదరించి, బిజెపి అభ్యర్థులను గెలిపిస్తారని రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు, ఇల్లందు ప్రభావరి యాప సీతయ్య అన్నారు. మండలంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాప సీతయ్య పాల్గొని మాట్లాడారు.
పల్లె పల్లెకు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఓటర్లు ఆత్రుత పడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి పార్టీ ని ఆదరించి బిజెపి అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉజ్వల గ్యాస్ పంపిణీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం, ముద్ర లోన్లు అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. మండలంలో 12 ఎంపీటీసీలు, 29 సర్పంచ్ అభ్యర్థులు, ఇతర వార్డు మెంబర్లను బిజెపి పార్టీ నుండి అభ్యర్థులు పోటీలో పాల్గొంటారని ప్రజల ఆదరించి, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో అందరూ దేశ సమైక్యత కోసం నడుం బిగించి వలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.
స్థానిక సంస్థలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, రాష్ట్ర నిధులు ఒక పైసా కూడా విడుదల చేయదని చెప్పారు. విధులు, నిధులు ఇచ్చే పార్టీని ఆదరించాలని మండల ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్, రాంమూర్తి, కోశాధికారి క్రాంతి, మాజీ మండలాధ్యక్షుడు రాసాల నరేష్, వన్నం రామారావు రేఖ ఉప్పలయ్య, కురియాల చంద్రయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


