డబ్బుల డీల్‌లో బీజేపీ నేతలు!
బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం?
సంచలన ఆరోపణలు చేసిన ఎస్సీ మోర్చా నేత కాటం సురేందర్
కాకతీయ/చేర్యాల : చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ పట్టణ నాయకులు కాంగ్రెస్ నేత వద్ద డబ్బులు తీసుకున్నారని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం సురేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నాలుగో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మ సుప్రజా రాజీవ్ కుమార్‌రెడ్డిని ఓడించాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకుడి వద్ద రూ.30 వేలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. మరింత డబ్బులు కావాలంటూ అదే బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతపై ఒత్తిడి తెచ్చినట్లు సురేందర్ తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత కాంగ్రెస్ నేత, ఆయన సతీమణి స్వయంగా ఫోన్ ద్వారా తనకు తెలియజేశారని చెప్పారు. అనంతరం పట్టణ బీజేపీ నాయకుల వద్ద ఆరా తీయగా వారు నోరు విప్పడం లేదని ఆరోపించారు. ఇలాంటి నేతల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి వ్యవహారాల్లో ఉన్న నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు.


