మాఫియా జిల్లాగా భద్రాద్రి!
ఇసుక–గంజాయి–డ్రగ్స్ అడ్డాగా మారిందా..?
అధికారులు నిద్రలో ఉన్నారా.. లేక చేతులు ఎత్తేశారా..?
పోలీస్ పోస్టింగుల్లోనూ రాజకీయ మాఫియా..?
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా తీవ్ర స్థాయి విమర్శలు
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేడు ఇసుక, గంజాయి, గుడుంబా, డ్రగ్స్ మాఫియాల కేంద్రంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లాలో నేరగాళ్లు, రౌడీ సీటర్లు రెచ్చిపోతుంటే పాలకులు, మంత్రులు మాత్రం చేతులు దులుపుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
సీఎం మాటలు ఎటుపోయాయి..?
గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని రేగా కాంతారావు ప్రశ్నించారు. ఒకవైపు సీఎం హడావుడి మాటలు మాట్లాడుతుంటే, మరోవైపు జిల్లాలో గంజాయి, గుడుంబా వ్యాపారం రోజురోజుకు పెరుగుతుండటం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
పోలీస్ స్టేషన్లలో మాఫియా రాజ్యం
జిల్లాలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని రేగా కాంతారావు పేర్కొన్నారు. గంజాయి, గుడుంబా మాఫియా నేతలకు, రౌడీ సీటర్లకు స్టేషన్లలో కుర్చీలు ఉంటే, సామాన్య ప్రజలు మాత్రం నిలబడి వేడుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకూ, పోలీస్ వ్యవస్థకూ తీరని అవమానమని ఆయన అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు తీసుకొని పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు రేగా కాంతారావు చేశారు. రాజకీయ జోక్యం వల్ల పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైతే శాంతి భద్రతలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సమాజం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలోనే కట్టడి
బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలకు అత్యున్నత ప్రాధాన్యత ఉండేదని, మాఫియాలకు కళ్లెం వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని రేగా కాంతారావు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గంజాయి, డ్రగ్స్, గుడుంబా మాఫియాలపై ఉక్కుపాదం మోపాలని, పోలీస్ వ్యవస్థను రాజకీయాల నుంచి విముక్తం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు, పోరాటాలు తప్పవని స్పష్టం చేశారు.


