ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి
: అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం
ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు : అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు
కట్టుదిట్టమైన భద్రత: ఏసీపీ వసుంధర యాదవ్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పక్రియ ముగిసే వరకు పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు చింతకాని, బోనకల్ మండలాల ఎన్నికల సందర్భంగా పోలీస్ బందోబస్తు సిబ్బంది యొక్క విధివిధానాలపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ..ఎన్నికల భద్రత అనేది సమష్టి బాధ్యతని, ఎన్నికలను విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎన్నికల విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. విధినిర్వహణలో సిబ్బందికి ఏదైనా ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఖచ్చితంగా పాటిస్తూ.ఎన్నికల విధులలో ఎలాంటి అలసత్వం లేకుండా క్రమశిక్షణతో తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు : అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు
గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్ డీసీపీప్రసాద్ రావు తెలిపారు. రఘునాథపాలెం మండలం ఎన్నికల పోలింగ్ బందోబస్తు, రూట్ మొబైల్ బందోబస్త్, పోలింగ్ స్టేషన్ బందోబస్త్ సిబ్బంది యొక్క విధివిధానాలపై స్థానిక పీఎస్‌లో అవగాహన కల్పించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేదని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, టౌన్ ఏసీపీ రమణమూర్తి, సిఐ ఉస్మాన్ షరీఫ్ పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత: ఏసీపీ వసుంధర యాదవ్
గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు.
మధిర మండలం మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పురస్కరించుకొని ఎన్నికల బందోబస్త్ కు కేటాయించిన పోలీస్ సిబ్బంది యొక్క విధివిధానాలపై అవగాహన కార్యక్రమం మధిరలోనిర్వహించారు. అనంతరం ఆమె గురువారం జరగనున్న ఎర్రుపాలెం మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను వైరా ఇన్చార్జి ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐ రమేష్, ఎస్సై లక్ష్మి భార్గవి పాల్గొన్నారు.



