బీసీల హక్కులు బీసీలకే దక్కాలి
జమ్మికుంట సదస్సును విజయవంతం చేయండి
నాయకుల పిలుపు
కాకతీయ, హుజురాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం ఈనెల 29న దినేష్ కన్వెన్షన్‌లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ రిజర్వేషన్ సదస్సుకు విస్తృత ప్రచారం మొదలైంది. హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్, కరపత్రాలను మానవ హక్కుల వేదిక, రాజకీయ పార్టీలు, దళిత ప్రజాసంఘాల నాయకులు కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.తరతరాలుగా విద్య, గౌరవం, సంపద, అధికారాల్లో భాగస్వామ్యం లేకుండా బీసీ కులాలు అణచివేయబడ్డాయని, వ్యవస్థీకృత పీడనను ఇప్పటికీ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ రంగం సహా ఏ కీలక రంగంలోనూ బీసీలకు వారి జనాభాకు తగిన వాటా లభించలేదని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్‌పై కొంత ముందడుగు వేస్తున్నప్పటికీ, ఇతర రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిని కనబరచడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో పార్టీలకతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.విద్య, ఉద్యోగం, ఉపాధి, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు అయ్యేలా కోర్టులు అడ్డురాని విధంగా రాజ్యాంగబద్ధ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర సంస్థల్లో, ప్రైవేట్ రంగంలో కూడా బీసీ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని నాయకులు అన్నారు.అత్యవసర ఎన్నికలు వచ్చిన సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీల జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని కోరారు.జమ్మికుంట సదస్సుకు రాజకీయ పార్టీల్లోని బీసీ నాయకులు, దళిత ప్రజాసంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు, ప్రజాతంత్ర మేధావులు, బుద్ధిజీవులు విస్తృతంగా హాజరవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, నాయకులు గుంటి సామ్రాజ్యం, బండి రమేష్, కొలిపాక సారయ్య, మార్త రవీందర్, పులి జగన్నాథం, వేల్పుల ప్రభాకర్, సాదుల వెంకన్న, భీమోజు సదన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


