బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్
జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు
మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్
14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు
ఆదిలాబాద్ జైలుకు తరలింపు… భారీగా పోలీసుల మోహరింపు
అక్రమ అరెస్టు అంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
కాకతీయ, మంచిర్యాల : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లాలో గురువారం బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతోంది. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై బాల్క సుమన్‌తో పాటు పలువురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో బాల్క సుమన్ (ఏ–ఒకటి), మూల రాజిరెడ్డి (ఏ–రెండు), దోమకొండ అనీల్ (ఏ–నాలుగు), మామిడి లక్ష్మీకాంత్ (ఏ–ఎనిమిది)లకు మంచిర్యాల కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు వారిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్ గడువు మార్చి మూడు వరకు కొనసాగనుంది. పోలీసులు సమర్పించిన రిమాండ్ నివేదికలో బాల్క సుమన్‌పై మొత్తం 11 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. బీఆర్ఎస్వీ నాయకులు విద్యార్థులు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు. పలు చోట్ల పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు, ముఖ్య ప్రాంతాల్లో పహారా నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.బాల్క సుమన్ అరెస్టు రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీయగా, ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు అరెస్టును అక్రమమని ఆరోపిస్తూ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


