మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణాస్వీకారం
కాకతీయ, హైదరాబాద్ : మాజీ క్రికెటర్ మరియు కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి అజారుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.

అజరుద్దీన్‌కు ఏ శాఖ కేటాయిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించేందుకు, అలాగే ఆ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


