శిశు మందిర్లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు
కాకతీయ, కరీంనగర్ : స్థానిక సరస్వతీ శిశు మందిర్ ఈఎంఈ హైస్కూల్లో భారత చార్టెడ్ అకౌంటెంట్ల సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీఏ కోర్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా చార్టెడ్ అకౌంటెంట్ తణుకు మహేష్ పాల్గొన్నారు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్లు గందె శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, సంస్థ నిర్వహణ కమిటీ సభ్యుడు రామిడి సంతోష్ హాజరయ్యారు.
ప్రధాన వక్త మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సీఏ కోర్సుకు దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు ఉందన్నారు. కృషి, పట్టుదలతో చదివితే ఈ కోర్సులో విజయం సాధించడం సాధ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు. సీఏ పూర్తిచేసిన వారికి బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు, బహుళజాతి కంపెనీలలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని వివరించారు.సదస్సులో విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో సీఏ చదవాలనుకునే వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని పాఠశాల కార్యదర్శి కోల అన్నారెడ్డి, ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.


