హక్కుల ఉల్లంఘనలపై అధికారులను సంప్రదించాలి
ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు
పౌర హక్కులపై అవగాహన సదస్సు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సమాజంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ 60వ డివిజన్ రామన్నపేట ఎస్సీ కాలనీలో పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సైదులు మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికైనా పౌర హక్కుల భంగం కలిగితే నేరుగా రెవెన్యూ శాఖను సంప్రదించవచ్చని, అవసరమైతే పోలీస్ శాఖ సహకారం కూడా పొందవచ్చని స్పష్టం చేశారు. చట్టం అందరికీ సమానమని, బాధితులు భయపడకుండా ముందుకు రావాలని సూచించారు. అవగాహన సదస్సులో హెచ్‌డబ్ల్యూ ఓ నెల్లూరి విజయ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి హక్కులపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ ఎస్సై భీమా, ఆర్ఐలు కృష్ణ, సత్యనారాయణ, జీపీవో బ్రహ్మం, రామన్నపేట గ్రామ పెద్దలు మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరై పౌర హక్కులపై వివరాలు తెలుసుకున్నారు.


