- మిక్కిలినేని దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వీడిఓఎస్ కాలనీలో ఉద్రిక్తత
కాకతీయ, ఖమ్మం : జిల్లాకేంద్రంలోని 54 డివిజన్ వీడిఓఎస్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సాయంత్రం నుండి ఆదివారం వరకు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ భర్త, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని నరేందర్ పై దాడికి కొంతమంది ప్రయత్నించారని ఆరోపిస్తూ మిక్కిలినేని వర్గీయులు ఆందోళనకు దిగారు. శనివారం సాయంత్రం నుండి కార్పొరేటర్ మంజుల తన వర్గీయులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పోలీసులు వారికి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆదివారం ఉదయం కొంతమంది వ్యక్తులు మిక్కిలినేని ఇంటిపై దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి తిరిగి ఉద్రిక్తంగా మారింది. దాడి జరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ నేపథ్యంలో మిక్కిలినేని వర్గీయులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితులు మరింత భయానకరంగా తయారయ్యాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్, ఆమె భర్త, కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని నరేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆయన వర్గీయులు భారీ స్థాయిలో పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సమీపంలో కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల విలేకరులతో మాట్లాడారు. ‘‘గత 32 రోజులుగా డివిజన్ పరిధిలో వీడివోస్ కాలనీలో చెరుకూరి సుజాత, చంద్రశేఖర్ దంపతులు రౌడీలతో ఇష్యు చేస్తున్నారు.
నిన్న నా భర్త నరేందర్ పై దాడి చేసి బెదిరించారు. టూటౌన్ పోలీస్ స్ట్రేషన్ లో వారిపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టాను. నిన్న రాత్రి వరకూ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయినా మేము శాంతియుతంగా వ్యవహరించాం. ఆదివారం ఉదయం ఓట్ ఫర్ చోరీ కార్యక్రమం జరుగుతుంటే సుజాత చిటికెలు వేసి అవహేళన చేసింది. మేము మరలా నిరసనకు దిగితే మమ్మల్ని స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు రాకేష్ పై డోర్నకల్ రౌడీలు దాడి చేశారు. రాకేష్ పరిస్థితి ఎలా ఉందో కూడా మాకు తెలియట్లేదు. నా డివిజన్ లో రౌడీ మూకలను ఉంచొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఖమ్మం లో ఎప్పుడూ లేని విధంగా రౌడీ బ్యాచ్ లు తిరుగుతుండటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. నాకు న్యాయం జరిగే వరకూ నేను పోరాటం చేస్తూనే ఉంటా’’నని ఆమె అన్నారు.


