తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని అన్నపై పగ
కిరాతకంగా చంపించిన అమ్మాయి తండ్రి
ఎల్లంపల్లిలో కలకలంరేపిన పరువు హత్య
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెను వేరే కులానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడని పగ పెంచుకున్నాడు సదరు యువతి తండ్రి. అయితే, కుమార్తెనో ఆమె భర్తను హత్య చేయలేదు. ఏకంగా యువకుడి కుటుంబంపై పడ్డాడు. వరుడి అన్నను కిడ్నాప్ చేయించి మరీ అతి కిరాతంగా హత్య చేయించాడు. వారిద్దరికీ పెళ్లి చేశాడని కక్ష పెంచుకుని.. అదును చూసి ప్రాణాలు తీసేశాడు. అతని మరణ వార్త విన్న బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమకు పెళ్లి చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడని నవ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. హత్యోదంతం తెలిసి గ్రామస్థులంతా రోదనలో మునిగిపోయారు. ఇష్టపడిన వారిని కలపడమే అతను చేసిన పాపమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


