చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అరుణ
వైస్ చైర్‌పర్సన్‌గా మెడిశెట్టి ఉమ
7 సీట్లు దక్కించుకుని తిరుగులేని మెజారిటీ సాధించిన బీఆర్ఎస్
కాంగ్రెస్ కౌన్సిలర్ సైతం గులాబీ పార్టీకే ఓటు
కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారం
కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా 6వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ముస్త్యాల అరుణ, వైస్ చైర్మన్‌గా 10వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మెడిశెట్టి ఉమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు అధికారులు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లతో సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 7 సీట్లు దక్కించుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈక్రమంలోనే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఆపార్టీకే దక్కాయి. వీరితోపాటు 5 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 7 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. చేర్యాల పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓటింగ్‌లో ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ముస్త్యాల అరుణను బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రతిపాదించగా.. ఆపార్టీ కౌన్సిలర్లు 7 మంది చేతులెత్తి మద్దతు తెలిపారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డు కౌన్సిలర్ ఒగ్గు వెంకటమ్మ సైతం బీఆర్ఎస్కు మద్దతు పలకడం గమనార్హం. కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా కొమ్ము రాజేశ్వరిని బలపరచగా 4 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులెత్తారు. వైస్ చైర్మన్ గా వెలుగల దుర్గయ్య ని కాంగ్రెస్ కౌన్సిలర్లు బలపరిచగా 5 మంది చేతులు ఎత్తారు. దీంతో చేర్యాల మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.



