చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అరుణ
వైస్ చైర్మన్‌గా మెడిశెట్టి ఉమా ఎన్నిక
బీఆర్ఎస్కు మద్దతుగా చేతులెత్తిన కాంగ్రెస్ కౌన్సిలర్
క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్ శిబిరంలో కలకలం
చేర్యాల మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ ఖాతాలోకి
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగి చివరకు బీఆర్ఎస్ పార్టీ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం చేర్యాల పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముస్త్యాల అరుణ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాగా, మెడిశెట్టి ఉమా వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. చైర్పర్సన్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ముస్త్యాల అరుణకు బీఆర్ఎస్కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు మద్దతుగా చేతులు ఎత్తారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు వెంకటమ్మ కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయడం రాజకీయంగా కలకలం రేపింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ లభించి చైర్పర్సన్ పీఠం ఖాయం అయింది.
ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున కొమ్ము రాజేశ్వరి చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ, ఆమెకు కేవలం నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు మాత్రమే లభించింది. కాంగ్రెస్ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

వైస్ చైర్మన్ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఆధిపత్యం
వైస్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా వెలుగల దుర్గయ్యను ప్రతిపాదించగా ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే మద్దతు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మెడిశెట్టి ఉమాకు మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో ఆమె వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితంతో చేర్యాల మున్సిపల్ పీఠం పూర్తిగా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లింది. కాంగ్రెస్ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, రానున్న రోజుల్లో దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


