కాకతీయ, నూగూరు వెంకటాపురం: గంజాయిని తరలిస్తున్నారని ఎస్సై కొప్పుల తిరుపతికి తగిన సమాచారం అందడంతో సిబ్బందితో నూగూరు శివారు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అతివేగంగా దూసుకొస్తున్న ఒక మూడు బైకులను గమనించారు. మొదటగా బైక్ పై వచ్చిన వారిని ఆపి వివరాలు సేకరిస్తుండగా వెనక వస్తున్న బైకు పై ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి మోటార్ సైకిల్ ను వెనుకకు తిప్పి వేగం పెంచడంతో అదుపు తప్పి కింద పడ్డారు.
వారి వద్ద ఉన్న బ్యాగ్ ను వదిలిపెట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లో నుంచి అడవిలోకి పారిపోయారు. వీరి వెనక వస్తున్న మరో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా వెనుకకు తిరిగి పారిపోయారు. మొదట అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా వారి బ్యాగులలో గంజాయి ఉందని, మమ్మల్ని పట్టుకోవడంతోనే మిగతా వ్యక్తులు పారిపోయారని తెలిపారు. వీరు పెంకరాయ గ్రామం మన్నెంకొండ మండలం మల్కాన్ గిరి జిల్లా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. వీరు గంజాయిని ఆర్డర్లపై కేజీ రూ.4వేలకు ఒడిశా నుంచి సేకరించి భద్రాచలం మీదుగా వెంకటాపురం, ములుగు నుంచి వరంగల్ వరకు కేజీ గంజాయిని రూ.10వేలకు సరఫరా చేస్తుంటారని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు.


