కాకతీయ, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 21వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టరాగమయి హాజరై ఏర్పాట్లపై సూచనలు చేశారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రవాణా, భద్రతా, వసతి, తాగునీటి సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను ప్రజల పండుగలా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు కూడా సంబంధిత విభాగాలతో కలిసి ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.


