కాకతీయ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక సూచన చేసింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో చెట్ల కింద నిలబడరాదు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండరాదు. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున విద్యుత్ తీగల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడవచ్చని వివరించింది.
ఇప్పటికే ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిల్లీమీటర్లు, పెద్దకూరపాడులో 40.2 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముక్కామలలో 39 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అధికారులు ప్రజలకు సూచిస్తూ వర్షాల సమయంలో అవసరం తప్ప బయటకు వెళ్లరాదని, వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు పొలాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగనున్నందున రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భద్రతా చర్యలు పాటించాలని APSDMA స్పష్టం చేసింది.


