ఏదులాపురం చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత
వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారిక ప్రకటన
ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తికానుంది
మంత్రి సమక్షంలో జరిగే ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
కాకతీయ, కూసుమంచి : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్ పేర్లను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఏదులాపురం మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికపై పార్టీ స్థాయిలో చర్చలు జరిగిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పేర్లను ఖరారు చేశారు. స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీ బలం, సామాజిక సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రి స్వయంగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

ప్రమాణ స్వీకారం అనంతరం అధికారిక ఎన్నిక
మున్సిపాలిటీలో గెలిచిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన వెంటనే చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మరియు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను అధికారికంగా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ ఎన్నిక లాంఛనప్రాయంగా పూర్తికానుంది. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


