వృద్ధురాలిని నట్టేట ముంచారు..!
విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు
మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి వృద్ధురాలు
కుటుంబ సభ్యులే మోసం చేసినట్టు ఆరోపణలు
న్యాయం చేయాలని అధికారులకు వేడుకోలు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మాధరెడ్డి ఈశ్వరమ్మ తన కుటుంబ సభ్యులే తనను మోసం చేసి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను వేడుకున్నారు.
ఈశ్వరమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అందరికీ వివాహాలు జరిగాయని చెప్పారు. భర్త మాధరెడ్డి తిరుపతి రెడ్డి అనారోగ్యంతో 2020లో మృతి చెందినట్లు తెలిపారు.
తెలియకుండా రిజిస్ట్రేషన్..!
భర్త జీవించి ఉన్న సమయంలోనే 2016లో తనకు తెలియకుండా కుమారుడు, చిన్న కుమార్తె కలిసి భర్తను హనుమకొండకు తీసుకెళ్లి శంభునిపల్లి గ్రామ శివారులోని సర్వే నెం.238/1/1/2/1/1/1లో ఉన్న 2 ఎకరాలు 14 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అందులో 1 ఎకరం 7 గుంటలు మనవరాలు స్వాతి పేరుపై, మిగిలిన 1 ఎకరం 7 గుంటలు కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు.
అలాగే భర్త మరణించిన అనంతరం పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి స్పెషల్ జీపీఏ తీసుకొని సర్వే నెంబర్లు 293/ఎ (1 ఎకరం 3 గుంటలు), 293/ఓ (3.5 గుంటలు), 293/బి (1 ఎకరం 35 గుంటలు) కలిపి మొత్తం 5 ఎకరాలు 22 గుంటల భూమిని కోడలు మాధరెడ్డి సుభాషిణి పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వృద్ధురాలు వాపోయారు.
ఈ విషయమై ప్రశ్నించగా తనపై దాడి జరిగిందని, అందులో కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు పెద్ద మనవరాళ్లే తన బాగోగులు చూసుకుంటున్నారని చెప్పారు. కుమారుడు, కోడలు, చిన్న మనవరాలు తనకు మందులు, భోజనం, ఆసుపత్రి ఖర్చులు కూడా పెట్టడం లేదని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు.
తన భూములు తిరిగి తనకు ఇప్పించి న్యాయం చేయాలని, తనను మోసం చేసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వృద్ధురాలు సంబంధిత అధికారులను వేడుకున్నారు.


