చైనా మాంజాలపై ఉక్కుపాదం
* విక్రయిస్తే కేసులు తప్పవు
* వాహనదారులకు ప్రాణహాని
* పక్షుల ప్రాణాలకు ముప్పు
* తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
కారేపల్లి ఎస్సై బైరి గోపి
కాకతీయ, కారేపల్లి : మండల కేంద్రంలో నిషేధిత చైనా మాంజాల విక్రయంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని కారేపల్లి ఎస్సై బైరి గోపి హెచ్చరించారు. సోమవారం గాలిపటాలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా మాంజాలను విక్రయించినా, వినియోగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజాలు
చైనా మాంజాల వల్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని, పలుమార్లు ప్రాణాపాయ స్థితులు ఎదురవుతున్నాయని ఎస్సై తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ మాంజాల కారణంగా గాయాలపాలవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు.
అలాగే ఆకాశంలో సంచరించే పక్షులు మాంజా దారాలకు చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత చైనా మాంజాలను విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత దుకాణాలపై కేసులు నమోదు చేసి చర్యలు తప్పవని హెచ్చరించారు.
పిట్టగోడలు లేని భవనాలపై పిల్లలు గాలిపటాలు ఎగరవేసే సమయంలో కిందపడే ప్రమాదం ఉందని పేర్కొంటూ, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చట్టవిరుద్ధమైన చైనా మాంజాలను వినియోగించకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ శంకర్ పాల్గొన్నారు


