టీటీడీకి ఓ అజ్ఞాత భక్తుడి భూరీ విరాళం
స్వామి వారికి 121 కిలోల బంగారం
టీటీడీకి చరిత్రలోనే మొదటిసారి
ధార్మిక కార్యక్రమాలకు తోడ్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కాకతీయ, తిరుమల :
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ అజ్ఞాత భక్తుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ విరాళాన్ని ప్రకటించారు. మొత్తం రూ.140 కోట్ల విలువైన 121 కిలోల బంగారంను తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించనున్నారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. టీటీడీకి ఇంత పెద్ద విరాళం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా భక్తులు నిత్యం ఆభరణాలు, బంగారం, వెండి, నగదు రూపంలో సమర్పణలు చేస్తూనే ఉన్నా, ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో బంగారం సమర్పించడం అరుదైన ఘట్టంగా భావిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుండగా, ఈ విరాళం సమాచారం తెలియగానే భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. టీటీడీ అధికారులు ఈ విరాళం స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తిరుమల భక్తుల ఆరాధన కేంద్రం. స్వామివారిపై అజ్ఞాత భక్తుని అపారమైన భక్తి, విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు టీటీడీ అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ఇది ఎంతో తోడ్పడుతుంది అని పేర్కొన్నారు. ఇదిలావుంటే, తిరుమలలో ఈ విరాళం వార్త ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


