సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి!
ప్రజాస్వామ్యంపై ట్రంప్ దండయాత్రను ఖండించాలి
అమెరికా వైఖరిపై దేశవ్యాప్త నిరసనలు అవసరం
కార్పొరేట్ల కోసమే ఎన్ఆర్ఈజీఎస్‌లో మార్పులు
శాసనసభకు రాని వారు రాజీనామా చేయాలి
జనవరి 18న సీపీఐ చారిత్రిక సభ
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ
కాకతీయ, ఖమ్మం : సంపద కోసమే అమెరికా వెనుజులాపై దాడి చేసిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ట్రంప్ చేస్తున్న దాడిని యావత్ ప్రజలు ఖండించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల సరఫరా పేరిట చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, వెనుజులాలోని ఆయిల్ సంపదను తమ వశం చేసుకునేందుకే ట్రంప్ అక్కడి అధ్యక్షుడు, ఆయన భార్యను బంధీలుగా చేశారని నారాయణ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంపై చర్చకు అవకాశం ఉన్నా దాన్ని పక్కనబెట్టి ట్రంప్ ప్రపంచ పోలీస్‌లా వ్యవహరిస్తున్నాడన్నారు. గతంలో అణుఆయుధాల పేరుతో ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చారని, ఆ తర్వాత అణుఆయుధాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
భారత్‌కు ముప్పే
వెనుజులాపై దాడి భారతదేశానికి కూడా నష్టమేనని, ఆయిల్ ఎగుమతుల పేరుతో భవిష్యత్తులో అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశాలపై విదేశీ శక్తులకు దాడి చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (ఎన్ఆర్ఈజీఎస్) మార్పులు కార్పొరేట్ సంస్థల కోసమే చేస్తున్నారని ఆరోపించారు. 40 కుటుంబాలకు రూ.28 లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, 85 కోట్ల మందికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి జంకుతోందన్నారు. జీఎస్టీ రూపంలో దోపిడీ చేస్తున్న కేంద్రం వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభను బైకాట్ చేసి వేతనాలు పొందటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తూ, సభకు వెళ్లని ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నారు.
జనవరి 18న చారిత్రిక సభ
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న చారిత్రిక సభ నిర్వహిస్తున్నామని నారాయణ తెలిపారు. లక్షలాది మందితో జరిగే ఈ సభకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరవుతారని, 15 రోజుల పాటు సభలు, సమావేశాలు, సదస్సులతో ప్రచారం కొనసాగుతుందన్నారు. మతోన్మాద శక్తులను అడ్డుకునే శక్తి కమ్యూనిస్టులకే ఉందని, కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.


