కాకతీయ, నేషనల్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ శ్రీజ– హర్ష్ వివాహం అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా మహాలక్ష్మీ ఆలయంలో వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో అంబటి రాంబాబు, ఆయన సతీమణి, వివాహితుల కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.
వివాహం అనంతరం కొత్త జంటను కుటుంబ సభ్యులు, సన్నిహితులు పరిచయం చేసుకున్నారు. శ్రీజ ఎండోక్రైనాలజిస్టుగా, ఆమె భర్త హర్ష్ సాఫ్ట్‌వేర్ రంగంలో అమెరికాలో పని చేస్తున్నారన్నారు. హర్ష్ వ్యక్తిత్వం మృదువుగా ఉందని రాంబాబు ప్రత్యేకంగా పేర్కొన్నారు.
అసలు వివాహం ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సి ఉండగా, ప్రస్తుతం అమెరికా–ఇండియా మధ్య వీసా, ప్రయాణ పరిమితుల నేపథ్యంలో వేడుకలు అమెరికాలోనే పరిమితం చేయాల్సి వచ్చిందని అంబటి తెలిపారు. అంబటి రాంబాబు కాస్త హాస్యభరితంగా, “మళ్లీ ఇండియాకు వస్తే ట్రంప్ తిరిగి రానిచ్చే అవకాశం లేదని” చెప్పడంలో వేదికపై ఉన్నవారందరూ నవ్వేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.



