మౌంట్ ఫోర్ట్‌కు పూర్వ విద్యార్థుల చేయూత
50 కుర్చీలు, పరీక్ష సామాగ్రి వితరణ
పాఠశాల అభివృద్ధికి అండగా నిలుస్తాం: గుండాల కృష్ణ
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని గుట్టలబజార్ ప్రాంతంలో ఉన్న మౌంట్ ఫోర్ట్ పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన 1982 బ్యాచ్ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తూ 50 కుర్చీలను వితరణగా అందజేశారు. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన ప్యాడ్లు, స్కేళ్లు, పెన్నులు, పెన్సిళ్లు తదితర పరీక్ష సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు, ఎస్బిఐటి మరియు ఆర్జేసి విద్యాసంస్థల ఛైర్మన్ గుండాల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రదర్ జాన్ పాల్‌కు కుర్చీలు అందజేసి, విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండాల కృష్ణ మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రదర్ జాన్ పాల్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించడం వారికి ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ పూర్వ విద్యార్థుల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు థామస్, రవి, పూర్వ విద్యార్థులు బాలశౌరి, బీవీ రామారావు, గుడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


