- నిబంధనలకు అనుగుణంగానే 128 షాపులు ఏర్పాటుకు అనుమతులు
- అడిషనల్ డీసీపీ
కాకతీయ, ఖమ్మం టౌన్: దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాలలో వ్యాపారులు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. బాణాసంచా దుకాణాల కేటాయింపునకు బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాటరీ పద్దతిలో డ్రా తీసి ఒకొక్కరికి దుకాణాలు కేటాయించారు. ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు నగరంలోని రెండు మైదానాల్లో 128 దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు జిల్లా అధికారులు అనుమతిచ్చారని, వీటిని ఎవరూ అతిక్రమించవద్దని అన్నారు. డిగ్రీ కళాశాలలో 86, పెవిలియన్ మైదానంలో 42 ఏర్పాటు చేయాలని నిర్ణయించి డ్రా తీసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాణసంచా దుకాణదారులు బకెట్లలో ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బాణాసంచా దుకాణాల ముసుగులో ఎవరూ కూడా డబ్బులు వసూళ్ళు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. దుకాణదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.


