జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ఖమ్మం నుంచే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య హెచ్చరిక
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల భూమిని తక్షణమే అప్పగించకపోతే ఖమ్మం నుంచే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఖమ్మం సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవ్వకపోవడం బాధాకరమన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ ఎప్పటికీ జర్నలిస్టుల పక్షానే ఉంటుందని, సమస్యల సాధన కోసం రాజ్యాంగబద్ధ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మహాసభలో టి. సంతోష్ చక్రవర్తి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మృతి చెందిన జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, అక్రిడిటేషన్ కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాల సమస్యపై తక్షణ పరిష్కారం వంటి డిమాండ్లతో పలు తీర్మానాలను మహాసభ ఆమోదించింది. ఈ మహాసభలో ఐఎఫ్‌డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపురావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి. రాజేందర్, పాల్వాయి జానయ్య తదితరులు పాల్గొన్నారు.


