ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవలు బంద్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం
డిజిటల్ ట్రాన్సాక్షన్‌లో కీలక మార్పులు
ఈ నెల 30తో ఎం-క్యాష్ సేవలకు ముగింపు
కాకతీయ, బిజినెస్: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు పేరుంది. రిటైల్, కార్పొరేట్, గ్రామీణ–అర్బన్ సర్వీసుల్లోనే కాదు, డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో కూడా ఎస్‌బీఐ భారీ స్థాయిలో సేవలు అందిస్తోంది. యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, భీమ్ ఎస్‌బీఐ పే వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది లావాదేవీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తీసుకునే ఏ చిన్న నిర్ణయంవైనా కోట్ల మంది కస్టమర్లపై ప్రభావం చూపుతుంది.
అలాంటి కీలక నిర్ణయాల్లో భాగంగా ఇప్పుడు బ్యాంక్ తన ఎం-క్యాష్(m-Cash) సేవలను నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఎస్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వారి డిజిటల్ చెల్లింపుల విభాగంలో అందిస్తున్న ఎం-క్యాష్ సేవ ఈ నెల 30వ తేదీ తర్వాత నుంచి పూర్తిగా బంద్ అవుతుంది.
ప్రస్తుతం ఈ సేవ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యోనో లైట్ యాప్ ద్వారా అందుబాటులో ఉంది. ఎం-క్యాష్ ద్వారా కస్టమర్లు లబ్ధిదారుడి ఖాతాను ముందుగా రిజిస్టర్ చేయకుండా కేవలం మొబైల్ నంబర్ / ఈమెయిల్ ఐడీతోనే డబ్బు పంపడం, స్వీకరించడం చేయగలిగే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ సులభ సదుపాయాన్ని ఎస్‌బీఐ నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇందుగల కారణాలు వెల్లడించకపోయినా, బ్యాంకు డిజిటల్ చెల్లింపుల్లో మరింత సురక్షిత విధానాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఎం-క్యాష్ నిలిపివేత తర్వాత కస్టమర్లు డబ్బు బదిలీ కోసం ఇతర సురక్షితమైన డిజిటల్ పద్ధతులు ఉపయోగించాలని ఎస్‌బీఐ సూచించింది. యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటివి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు. ఈ నెల 30వ తేదీ తర్వాత m-Cash సేవ పూర్తిగా నిలిపివేయబడనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగానే ప్రత్యామ్నాయ డిజిటల్ పద్ధతులకు అలవాటు పడడం మంచిది. ముఖ్యంగా UPI లాంటి సులభ మార్గాలు m-Cashకు బెస్ట్ రీప్లేస్‌మెంట్‌గా మారనున్నాయి. భీమ్ ఎస్‌బీఐ పే, యోనో వంటి యాప్‌ల ద్వారాకూడా మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ లేదా ఖాతా నంబర్ ఉపయోగించి వెంటనే లావాదేవీలు చేసుకోవచ్చు.


