సింగరేణి డేను బహిష్కరించిన ఏఐటీయూసీ
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని నామమాత్రంగా నిర్వహించడాన్ని నిరసిస్తూ గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ‘సింగరేణి డే’ వేడుకలను బహిష్కరించింది. మంగళవారం కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి దినోత్సవాన్ని గతంలో ఘనంగా నిర్వహించేవారని, ఈసారి నిధులు కుదించి జీఎం కార్యాలయాలకే పరిమితం చేయడం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలను అవమానించారని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. సంప్రదాయాలకు విలువ తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి గట్టయ్యతో పాటు సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


