కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాచలంలో దీపావళి టపాసుల అక్రమ స్థావరాలపై టాస్క్ ఫోర్స్, భద్రాచలం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు దీపావళి టపాసుల అక్రమ నిల్వలపై జిల్లా టాస్క్ఫోర్స్, భద్రాచలం పోలీసులు సంయుక్తంగా దాడులను నిర్వహించారు. భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ, ఇండస్ట్రీయల్ ఏరియా, గ్యాస్ గొడౌన్ ఏరియాలలో జనావాస ప్రాంతాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా దీపావళి మందులను నిల్వ ఉంచిన నలుగురు వ్యక్తులపై భద్రాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైందని పేర్కొన్నారు.
సుమారుగా పది లక్షల రూపాయల విలువ గల దీపావళి టపాసులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా టపాసులను అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాహితార్థం ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా ఈ విధంగా టపాసులను అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 నకు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, సీఐ నాగరాజు కోరారు. ఈ దాడులలో టాస్క్ ఎస్సైలు ప్రవీణ్, రామారావు సిబ్బంది పాల్గొన్నారు.


