- స్వగ్రామంలో విషాదఛాయలు
- సంతాపం తెలిపిన ప్రముఖులు, రాజకీయ నాయకులు
కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) సబ్బతి విష్ణుమూర్తి ఆదివారం రాత్రి హైదరాబాదులోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. 1991 బ్యాచ్ పోలీస్ శాఖలో ఎస్సైగా తన ఉద్యోగాన్ని ప్రారంభించిన విష్ణుమూర్తి ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాలలో పదోన్నతులు పొందుతూ విధులు నిర్వహించారు. ముక్కు సూటిగా వ్యవహరించేవారు. రౌడీయిజం పెట్రేగిపోతున్న సమయంలో కొత్తగూడెం పట్టణంలో రౌడీయిజాన్ని అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించేవారని నేటికీ విష్ణుమూర్తి పేరు చర్చకు వస్తుంది.
అనంతరం సీఐగా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఏసీపీ విష్ణుమూర్తి మరణ వార్త తెలుసుకున్న వెంగన్నపాలెం, జూలూరుపాడు గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాదులో విష్ణుమూర్తి భౌతిక దేహాన్ని మల్టీ జోన్ ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పోలీస్ ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు. విష్ణుమూర్తి అంత్యక్రియలు స్వగ్రామం జూలూరుపాడులో మంగళవారం రగనున్నట్లు విష్ణుమూర్తి సోదరుడు సబ్బతి శివమూర్తి తెలిపారు.


