పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
కాకతీయ, కొత్తగూడెం: పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫోక్సో స్పెషల్ జడ్జ్,అదనపు ఇంచార్జి) ఎస్. సరిత సోమవారం తీర్పును వెల్లడించారు. చంద్రుగొండ మండలం,తిప్పనపల్లి గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన సయ్యద్ లాలూ@ లాల్ మియాపై 06.08.2023 తేదీన అఘాయిత్యం చేయగా ఆ విషయం పైన ఫిర్యాదు అందుకున్న చంద్రుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు.అప్పుడు స్టేషన్ హౌస్ అధికారిగా ఉన్న ఎం.రవి కేసు నమోదు చేశారు.విచారాణాధికారిగా వ్యవహరించిన కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారి షేక్ అబ్దుల్ రెహమాన్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ ను దాఖలు చేశారు.కోర్టులో 14 మంది సాక్షులను విచారించిన పిదప సయ్యద్ లాలు @ లాల్ మియా పై నేరం రుజువు కాగా జీవిత ఖైదుతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించారు.జరిమానా చెల్లించకపోతే ఒక సంవత్సరం సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మి,కోర్టు నోడల్ అధికారి ఎస్సై డి.రాఘవయ్య ,లైజన్ అధికారి ఎస్.వీరభద్రం (కోర్టు డ్యూటీ ఆఫీసర్) బి.లక్ష్మణ్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.


