పరారీలో ఉన్న ఫారెస్టు ఎఫ్డీసీ మేనేజర్ అరెస్ట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏరియాలో అదుపులోకి తాటి శ్రావణి
రూ.28 లక్షల లంచం కేసులో కీలక పరిణామం
ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలం
నేడు ఏసీబీ కోర్టులో హాజరు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : లంచం తీసుకున్న కేసులో పరారీలో ఉన్న కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ అధికారులు శనివారం విశాఖ పట్నంలో అరెస్ట్ చేశారు.ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆమెను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది. గత నెలలో వెలుగులోకి వచ్చిన రూ.28 లక్షల లంచం వ్యవహారంలో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. జనవరి 3న అన్నపురెడ్డిపల్లి మండలం సీతాయిగూడెంలో రెంజర్ రాజేందర్, మధ్యవర్తి గోపాలకృష్ణ కలిసి రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టన్నుకు రూ.90 చొప్పున మొత్తం రూ.28 లక్షలు డిమాండ్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారానికి డివిజనల్ మేనేజర్ శ్రావణి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఏసీబీ నిర్ధారించింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రెంజర్ రాజేందర్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేయగా, డివిజనల్ మేనేజర్ శ్రావణి మాత్రం పరారయ్యారు. అప్పటి నుంచి ఆమెపై ఏసీబీ ప్రత్యేక నిఘా పెట్టింది. పలు ప్రాంతాల్లో దాగి ఉన్నట్టు సమాచారం అందడంతో అన్వేషణ కొనసాగించగా, చివరికి ఆమె విశాఖపట్నంలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు శ్రావణి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కోర్టు నుంచి ఉపశమనం లభించలేదు. తాజాగా పట్టుబడిన ఆమెను శనివారం ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లంచం వ్యవహారం రాష్ట్ర స్థాయిలో అటవీ అభివృద్ధి సంస్థలో తీవ్ర సంచలనంగా మారింది. సంస్థ ఉన్నతాధికారుల సమావేశం జరుగుతున్న సమయంలోనే రెంజర్ పట్టుబడటం అప్పట్లో పెద్ద కలకలం రేపింది. ఈ కేసులో మరికొంతమంది పాత్రపై కూడా ఏసీబీ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.


