కాకతీయ, పినపాక : అబ్దుల్ కలాం ఆశయాలను విద్యార్థులు ముందుకు తీసుకువెళ్లాలని పినపాక ఎంఈఓ నాగయ్య అన్నారు. బుధవారం పినపాక మండల పరిధిలోని ఈ బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు విద్యార్థుల నడుమ నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈఓ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత కాలం మొత్తం విద్యార్థుల కోసమే కృషి చేశారని తెలిపారు. ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం లాగా ఎదిగి దేశానికి సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు తిరుపతిరెడ్డి, పీడీ వీరన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


