కంటి చూపు కోల్పోయిన యువకుడు
ఇప్పటికే రూ.5 లక్షల ఖర్చు…
వైద్యానికి దాతల సాయానికి ఎదురు చూపు
కాకతీయ, ఖమ్మం టౌన్ : పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ యువకుడి జీవితాన్ని విధి చీకటిలోకి నెట్టేసింది. ఖమ్మం జిల్లా పాండురంగాపురానికి చెందిన ఏర్పుల శ్రీకాంత్ (36) గత 20 ఏళ్లుగా పెయింటింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. రోజువారీ పనుల్లో ఉపయోగించే పెయింటింగ్ కెమికల్స్ ప్రభావంతో మూడున్నరేళ్ల క్రితం నుంచి అతడికి కంటి చూపు మందగించడం ప్రారంభమై, క్రమంగా పూర్తిగా చూపు కోల్పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు లేకుండా అనాథగా పెరిగిన శ్రీకాంత్, వివాహం చేసుకుని కుటుంబ బాధ్యతలు తీసుకున్న కొద్ది సంవత్సరాలకే కంటి చూపు కోల్పోయాడు. దీంతో కుటుంబం వీధిన పడిందని స్థానికులు చెబుతున్నారు. “రెక్కాడితే గాని డొక్కాడని పేదింటి పెయింటర్‌కు 36 ఏళ్లకే కొండంత కష్టం వచ్చింది” అంటూ వారు కన్నీరు పెట్టుకుంటున్నారు.
వైద్యానికి లక్షల ఖర్చు
ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సల కోసం దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశామని శ్రీకాంత్ తెలిపాడు. కేరళలో ప్రత్యేక వైద్యం చేయించుకుంటే కంటి చూపు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని, అయితే దానికి మరో రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వివరించాడు. వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న శ్రీకాంత్… మానవతా హృదయులు, దాతలు ముందుకు వచ్చి తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు. తన జీవితానికి మళ్లీ వెలుగు రావాలంటే సమాజ సహకారమే దారి అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. సహాయం చేయదలచిన దాతలు 80192 22023 నంబర్‌ను సంప్రదించాలని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశాడు.


