సావిత్రిబాయి పూలేకి ఘన నివాళి
టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు
మహిళా ఉద్యోగులకు శాలువాలతో సత్కారం
కాకతీయ, ఖమ్మం : మహిళా విద్యకు మార్గదర్శకురాలు, సామాజిక సంస్కరణ యోధురాలు, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవోస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మహిళా ఉద్యోగులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… మహిళలు చదువుకోవడమే నేరంగా భావించిన కాలంలోనే సావిత్రిబాయి పూలే విద్యను ఆయుధంగా చేసుకుని మహిళల హక్కుల కోసం పోరాడారని అన్నారు. మహిళా సాధికారత, సమానత్వం, విద్యా హక్కుల సాధనలో ఆమె చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఆమె ఆలోచనలు నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొణిదేన శ్రీనివాస్ మాట్లాడుతూ… భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యనభ్యసించి, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచిన సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు. ఆమె చూపిన మార్గంలో నడుస్తూ బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జెడ్.ఎస్. జైపాల్, ఉపాధ్యక్షులు ఎర్ర రమేష్, జాయింట్ సెక్రెటరీ బుస చంద్రశేఖర్, నగర అధ్యక్షుడు బెజ్జంకి ప్రభాకర చారి, రఘునాథపాలెం యూనిట్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఈసీ మెంబర్ ఎన్. విజయ, హాస్టల్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు కోటపాటి రుక్మారావు, కార్యదర్శి నెల్లూరి నాగేశ్వరరావు, మెడికల్ ఫోరం అధ్యక్షుడు సైదులు, జాయింట్ సెక్రెటరీ కృష్ణ, వీరన్నతో పాటు టీఎన్జీవోస్ నాయకులు ఎం. కోమలి, పి. మాధురి, బుర్రి వెంకటేశ్వర్లు, సిహెచ్. నాగమణి, బాలాజీ, ఎం. బాలు, కే. నరేందర్ రెడ్డి, ఎన్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.


