కొడవలి కోత… పంచరైన కారు…
కాంగ్రెస్– సీపీఐ మధ్య పెరిగిన దూరం
బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ… భవిష్యత్‌పై అనిశ్చితి
పొత్తుల వైఫల్యం… రాజకీయ పాఠమా?
కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా తీర్పు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనంగా మారింది. పొత్తులు కుదరక ప్రధాన పార్టీలు విడివిడిగా బరిలోకి దిగడంతో ఫలితాలు అనూహ్య మలుపు తీశాయి. క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అదే సమయంలో వామపక్ష పార్టీ సీపీఐ అత్యధిక స్థానాలు గెలిచి ప్రధాన శక్తిగా అవతరించింది. 60 డివిజన్లున్న కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాలకు పరిమితమవగా, సీపీఐ 23 స్థానాలు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమై గట్టి ఎదురుదెబ్బ తిన్నది. దీంతో కార్పొరేషన్లో స్పష్టమైన ఆధిపత్యం ఏ ఒక్క పార్టీకి దక్కని పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్– సీపీఐ మధ్య పెరిగిన దూరం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్– సీపీఐ పొత్తు భద్రాద్రి జిల్లాలో కీలక విజయాలకు దోహదపడింది. అదే పొత్తు కొనసాగుతుందని భావించినా, కార్పొరేషన్ ఎన్నికల ముందు సీట్ల పంపకంపై విభేదాలు తలెత్తడంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. పొత్తు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సీపీఐ ఒంటరిగానే బరిలోకి దిగింది. స్థానిక ఎమ్మెల్యే నుంచి కార్యకర్తల వరకు సమన్వయంతో పనిచేయడంతో సీపీఐ అత్యధిక స్థానాలు గెలుచుకుని రాజకీయంగా తన బలాన్ని చాటింది. ఈ పరిణామం భవిష్యత్తులో కాంగ్రెస్‌కు సవాలుగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ… భవిష్యత్‌పై అనిశ్చితి
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 9 స్థానాలకు పరిమితమవడం ఆ పార్టీకి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీకి ప్రజల మద్దతు తగ్గిన సంకేతాలు ఈ ఫలితాల్లో కనిపించాయి. ప్రస్తుతం కార్పొరేషన్లో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. ముఖ్యంగా సిపిఐ పార్టీకి మద్దతు లభిస్తే మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పొత్తుల వైఫల్యం… రాజకీయ పాఠమా?
ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలక రాజకీయ సందేశాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. పొత్తులు కుదరకపోవడం, అంతర్గత విభేదాలు, స్థానిక స్థాయి అసంతృప్తి వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వామపక్ష పార్టీలను విస్మరించడం కాంగ్రెస్‌కు నష్టం కలిగించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో స్థానిక రాజకీయాల్లో పొత్తుల ప్రాముఖ్యత మరింత పెరిగే అవకాశం ఉందని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జిల్లాలో రాజకీయ సమీకరణాలను మార్చే సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.


