సంతృప్తికరమైన అభిరుచి అలవాటుగా ఉండాలి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
చిన్నప్పటి నుంచి తపాలా స్టాంపులను అసక్తిగా సేకరించాను
జిల్లాస్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కలెక్టర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తమకు సంతోషాన్ని కలిగించే సంతృప్తికరమైన అభిరుచి ప్రతి ఒక్కరికి అలవాటుగా ఉండాలని, దాని వలన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, జిజ్ఞాస పెరగడానికి దోహదపడుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. డి.పీ.ఆర్.స భవనంలో గురువారం జిల్లా తపాలా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే ఖమ్మం జిల్లా స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ 2025 ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. ఏర్పాటు చేసిన వివిధ రకాల తపాలా స్టాంపుల ప్రదర్శనను విద్యార్థులతో కలిసి అసక్తిగా కలెక్టర్ తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ చిన్నతనంలో తాను పోస్టల్ స్టాంపులను చాలా ఆసక్తితో సేకరించేవాడినని, స్నేహితులతో తపాలా స్టాంప్ లను మార్చుకొని చాలా పెద్ద కలెక్షన్ పెట్టుకునే వాడినని గుర్తు చేసుకున్నారు. ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిన్నతనంలో కరీంనగర్ జిల్లాకు చెందిన చాలా మంది ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారని, స్నేహితుల పేరెంట్స్ గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి స్టాంపులు తీసుకుని రావాలని కోరినట్లు కలెక్టర్ తెలిపారు. స్టాంపుల సేకరణ చాలా సంతోషాన్ని కలిగించిందని, అది ఒక దేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, విజ్ఞానం చూపిస్తుందని అన్నారు. ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ పిల్లలకు చాలా ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఆనందాన్ని కల్గించే ఒక హాబీ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. హబీ మన వ్యక్తిత్వం, పరిశోధనతత్వం, ఆత్మవిశ్వాసం, జిజ్ఞాస, క్రమశిక్షణ పెరగడానికి ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రస్తుత జనరేషన్ ఎక్కువ డిజిటల్ వైపు అడుగులు వేస్తుందని, ఔట్ డోర్ యాక్టివిటిస్, స్నేహితులతో బయట ఆడుకోవడం చాలా తగ్గిపోయిందని, దీని వలన లాభాల కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. పిల్లలు డిజిటల్ ప్లాట్ ఫారం మొబైల్, ఇస్టగ్రామ్, ఫెస్బుక్, వాట్సప్, యూట్యూబ్ లలో తక్కువ సమయం గడపాలని కలెక్టర్ సూచించారు.
ఫిలాటెలిక్ అలవాటు పోస్టల్ స్టాంపు సేకరణ చాలా ఆనందం కలిగిస్తుందని, మనం కొంచెం శ్రమ పెట్టి సేకరించిన స్టాంపులు లేదా ఇతర హాబీల వలన మనకు అధిక సంతృప్తి వస్తుందని అన్నారు. పోస్టల్ స్టాంపు సేకరణ అలవాటు భవిష్యత్తు తరాలకు అందించాలని కలెక్టర్ కోరారు.
అనంతరం జిల్లా పోస్టల్ భీమాపాలసీ పరిహారం చెక్కులను లబ్ధిదారులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందజేశారు.ఈ కార్యక్రమంలో తపాలా శాఖ పర్యవేక్షకులు వీరభద్ర స్వామి, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



