ఎస్ఐ–సీఐల మధ్య వాడీ వేఢీ
కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండకం
ఫోన్లో కుల వివక్ష వ్యాఖ్యల ఆరోపణలు
ఖర్చుల వ్యవహారంతో మొదలై.. ఉద్రిక్తతకు దారి
పై అధికారులకు చెప్పుకోలేని స్థితిలో ఎస్ఐ?

కాకతీయ, నిఘా ప్రతినిధి : వరంగల్ పోలీస్ కమిషన రేట్ పరిధిలో ఎస్ఐ–సీఐ మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఈస్ట్ జోన్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ములుగు వైపు వెళ్లే జాతీయ రహదారి 163కు ఆనుకుని ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఫోన్లో తీవ్ర పదజాలంతో దూషణలు, కుల వివక్ష వ్యాఖ్యలు చేసుకున్నట్లు సమాచారం. అంతర్గత విభేదాలు బహిర్గతమవడంతో శాఖలో స్టేషన్లో వాతావరణ వేడెక్కినట్లు సమాచారం. ఇటీవల స్టేషన్కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ వారంటీ ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఒడిశా వెళ్లాల్సి వచ్చినట్లు సమాచారం. ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఎస్ఐని సంప్రదించగా, ఎస్హెచ్ఓ ఉన్నప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు అంటూ తిరస్కరించారనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ నేరుగా సీఐకి ఫోన్ చేసి ఖర్చుల కోసం డబ్బులు అడిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహించిన సీఐ, వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. “మీ కులపోడు అని సపోర్ట్ చేస్తున్నావా?”, “మీ కులపొళ్ళు కలిసి నన్ను ఏం చేయలేరు” వంటి వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక “త్వరలోనే ప్రమోషన్ మీద డీఎస్పీ అవుతున్నాను… అప్పుడే మీ సంగతి చూస్తా” అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
రాజకీయ బలం ఉందంటూ వ్యాఖ్యలు?
ఫోన్ సంభాషణలో సీఐ తనకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల మద్దతు ఉందని, తనను ఎవరూ బదిలీ చేయలేరని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఎస్ఐ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగి ఘర్షణ స్థాయికి చేరినట్లు సమాచారం. “నేను స్టేషన్కు వచ్చాక చూస్తా” అంటూ సీఐ ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. స్టేషన్లో కొన్ని కేసులు, లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఇద్దరి మధ్య ఉండటంతో, ఎస్ఐ కూడా పై అధికారులకు ఫిర్యాదు చేయలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. దీంతో సిబ్బంది మధ్య ఉద్రిక్తత పెరిగిందని చెబుతున్నారు. సదరు సీఐ ప్రవర్తనపై ఇప్పటికే అసంతృప్తి ఉందని తోటి సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం. గతంలో ఇదే స్టేషన్లో పనిచేసిన ఆరుగురు కానిస్టేబుళ్లు వేధింపులు తట్టుకోలేక ఒకేసారి బదిలీ చేయించుకున్నారనే ప్రచారం వినిపిస్తోంది. పనిలో చిన్నచూపు చూడటం, దురుసుగా మాట్లాడటం, అనవసర ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు సిబ్బంది కూడా ఆ అధికారితో కలిసి పని చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. కేసుల నమోదులో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
శాఖ ప్రతిష్ఠకు ముప్పు?
ఈ ఘటనతో స్టేషన్లో క్రమశిక్షణ, పరస్పర గౌరవం ప్రశ్నార్థకమైందన్న చర్చ పోలీసు శాఖలో జరుగుతుండటం గమనార్హం. కుల వివక్ష ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని సిబ్బంది, స్థానికులు కోరుతున్నారు. శాఖలోని అంతర్గత విభేదాలు బహిర్గతమవడం, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవడం వంటి అంశాలు పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.


