మృత్యువులోనూ వీడని బంధం!
బోనకల్ వద్ద జరిగిన ప్రమాదంలో వైరా దంపతులు మృతి
ఇటీవలే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన మహిళ
చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషింకుంటున్న భర్త
రోడ్డు ప్రమాదం రూపంలో బతుకులను కడతేర్చిన విధి
తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు
వైరా టీచర్స్ కాలనీలో విషాద చాయలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జీవితాన్ని సాగిస్తున్న భార్యాభర్తలను మృత్యువు ఒకే క్షణంలో కబళించింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు… మృత్యువులోనూ ఆ దంపతుల బంధాన్ని విడదీయలేకపోయింది. తల్లిదండ్రుల దుర్మరణంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న వడ్డాది రాము, వెంకటరత్నం దంపతులు దుర్మరణం చెందారు.
ఒక్క ప్రయాణం… రెండు ప్రాణాలు
వడ్డాది రాము గ్రామాల్లో తిరుగుతూ పరుపుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన సతీమణి వెంకటరత్నం ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగానే వ్యాపారం ముగించుకున్న రాము, సతీమణి వెంకటరత్నాన్ని తన ట్రాలీ ఆటో క్యాబిన్‌లో కూర్చోబెట్టుకొని జగ్గయ్యపేట నుంచి వైరాకు బయలుదేరాడు. సోమవారం గ్రామ సమీపంలో వైరా నుంచి బోనకల్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన రామును సమాచారం అందుకున్న వైరా ఎస్సై పుష్పాల రామారావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాము కూడా మృతి చెందాడు. ఇద్దరు కుమారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. కేసు నమోదు చేసిన వైరా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల దుర్మరణంతో వైరా టీచర్స్ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రాము–వెంకటరత్నం దంపతుల భౌతికకాయాలను పలు రాజకీయ పార్టీల నాయకులు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, కాంగ్రెస్ నాయకులు కట్ల సంతోష్, కట్ల నాగరాజు, పర్సా రవి తదితరులు దంపతులకు చివరి నివాళులు అర్పించారు.


