పట్టణంపై మంచు దుప్పటి
కశ్మీర్ ను తలపించిన కొత్తగూడెం
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా కేంద్రంలో శనివారం పొగ మంచు చుట్టుముట్టడంతో కొత్తగూడెం పట్టణం కాశ్మీర్ ను తలపించింది. తెల్లవారుజాము నుంచి మంచు కురిసి ఉదయం 8:30 గంటల తర్వాత తెరిపించింది. రెండు రోజుల నుంచి పట్టణంలో మంచు విపరీతంగా కురుస్తోంది. మంచు కారణంగా
ప్రతి వాహనదారుడు నెమ్మదిగా నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ముందు వెళ్లే వారు వాహనాల లైట్లు వేసుకొని ప్రయాణించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పొగమంచు దట్టంగా కురియడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న రెండు మూడు రోజులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలతో పాటు ఏజెన్సీ ప్రాంతవాసులు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


