- 34 ప్రశ్నలతో ఇంటింటి డిజిటల్ సర్వే
- జనగణనతోపాటు ఇంటి గణన కూడా చేస్తున్నాం
- సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ జ్ఞాన శేఖర్
కాకతీయ, పినపాక: జనగణన 2027 ముందస్తు ప్రణాళికలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన ప్రాంతాలలో నవంబర్ 10 నుండి 30 వరకు ప్రీ-టెస్ట్ మొదటి దశ నిర్వస్తారని సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ తెలిపారు. మంగళవారం పినపాక రైతు వేదికలో జరిగిన ఇనామినేటర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండ్ల జాబితా, ఇండ్ల గణన సర్వే చేపడుతారన్నారు. ఈ ప్రీ-టెస్ట్ లో పినపాక మండలంలోని జానంపేట, సింగిరెడ్డిపల్లి, ఏల్చిరెడ్డి పల్లి, అల్లంపల్లి, గడ్డంపల్లి, పినపాక, బయ్యారం గ్రామాలు ఎంపికయ్యాయని తెలిపారు. ఈ సర్వేలో ఇండ్ల జాబితా, ఇండ్ల పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, త్రాగునీరు, మురుగునీటి పారుదల, మరుగుదొడ్లు, వంటగది లభ్యత, రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కార్ తదితర సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 34 ప్రశ్నలకు సంబంధించిన వివరాలు సేకరిస్తారన్నారు.
ఈ సర్వే పూర్తిగా డిజిటల్ పద్ధతిలో యాప్ ద్వారా నిర్వహిస్తారని ఇందుకు ఎంపికైన 7 రెవెన్యూ గ్రామాలకు 57 బ్లాకులుగా విభజించి, 41 మంది ఎన్యూమరేటర్లు, ఏడుగురు సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. ఈ సర్వేను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రిన్సిపాల్ సెన్సస్ ఆఫీసర్ గా, తహశీల్దార్ గోపాలకృష్ణ చార్జ్ ఆఫీసర్గా పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ సెన్సెస్ ఆపరేషన్ ఆర్ శేఖర్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాజు, సెన్సెస్ ఆఫీసర్లు సతీష్, హిమవర్ష, హరిత, వినయ్, తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


