- 20 నాటికి లక్ష్యం మేర విడుదల పూర్తి చేయాలి
- మత్స్యశాఖపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వాకిటి శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: చేప పిల్లలు చెరువుకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖల మంత్రి వాకాటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మత్స్య శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ఖమ్మం కలెక్టరేట్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొన్నారు. చేపల పంపిణీ టెండర్ల ఫైనల్ చేయడం, చేపల పంపిణీ పర్యవేక్షణ ఇతర శాఖల అధికారుల నియామకం, యాక్షన్ ప్లాన్ తయారీ, తదితర అంశాలపై సమీక్షించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేపలు చెరువులలో విడుదల కార్యక్రమం ఇప్పటికే ఆలస్యమైందని, నవంబర్ 20 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు నీటి వనరులలో చేప, రొయ్య పిల్లల విడుదల పూర్తి చేయాలని అన్నారు.
చేపల పంపిణీ కార్యక్రమం అమలులో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నీటి వనరుల్లో చేప పిల్లల విడుదల వేగంగా పూరి చేయాలన్నారు. టీ-మత్స్య యాప్ లో చేప పిల్లల వివరాలు, సరఫరాదారుల, రవాణా చేసే వాహనం సంపూర్ణ వివరాలను మత్స్య శాఖ అధికారి పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు. చేపల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. రాబోయే 18 రోజుల పాటు చాలా కీలకంగా ఉంటుందన్నారు. పారదర్శకంగా ఈ కార్యక్రమం జిల్లాలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. మత్స్యకారులు అధికంగా చేపల ఉత్పత్తి చేసేలా చూడాలని, చేపల ఉత్పత్తి పెంచడంతో పాటు వాటి విక్రయానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాలలో చేపల స్టాల్స్, ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ వీసీ అధికారులతో మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, మత్స్యకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శి, మండలంలో ఉన్న నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో చర్చించుకుని చేప పిల్లల విడుదల షెడ్యూల్ తయారు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా నీటిపారుదల అధికారి వెంకట్రాం, మత్స్య శాఖ సిబ్బంది రవికుమార్, ఫిషరీస్ అసిస్టెంట్లు రాజేష్, సరిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


