- 9 మంది భక్తులు మృతి
- మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది మహిళలు
- 13 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
- భక్తుల రద్దీ పెరగడంతో ఊడిపడిన రెయిలింగ్..
- కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తీవ్ర విషాదం
- నిర్వాహకుల వైఫల్యమే ప్రధాన కారణం !
- ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
- చంద్రబాబు, పవన్‌సహా ప్రముఖుల విచారం
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

కాకతీయ, అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు చనిపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. ఘటనాస్థలంలో ఏడుగురు, పలాస ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందారు. తొక్కిసలాటలో 13 మందికి గాయాలు కాగా వారిని పలాస ఆసుపత్రికి తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చినా, పోలీసులకు దేవాదాయశాఖ అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. అంతేకాకుండా ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్లే మార్గం, తిరిగి వచ్చే మార్గం ఒకటే ఉండటం వల్ల కూడా రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారితీసిందని అంటున్నారు. రెయిలింగ్ ఊడిపడటంతో ఈ ఘటన జరిగింది.
12 ఎకరాల్లో ఆలయం నిర్మాణం ..

ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం హరిముకుంద్ పండా అనే వ్యక్తి 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు రూ.20 కోట్లతో ఆలయాన్ని నిర్మించారు. గతేడాది జులైలో ఈ దేవస్థానం దర్శనాలు ప్రారంభంఅయ్యాయి. ప్రతి శనివారం దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి హరిముకుంద్పండా ధర్మకర్తగా ఉన్నారు. ప్రతి శనివారం 1500 నుంచి 2 వేల మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుంది. 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ ఊడిపడటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించే తన ఆలోచన అంతా అనీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పీఎంవో ఆఫీసు ప్రకటించింది.
కలచివేసింది : చంద్రబాబు
తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకరమైన ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. “శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయాల పాలైన వారికి మెరుగైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను కోరాను. అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తొక్కిసలాట విషాదకరం
తొక్కిసలాస ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా 9 మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. ఈ విషాదకర ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశాం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.
సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న హోంమంత్రి
తొక్కిసలాట ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఈ ఘటనపై ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన అనిత, సమగ్ర విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని అధికారులకు సూచించారు.
ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు
కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని తాను ఊహించలేదని, ఆలయానికి 2000 మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని చెప్పారు. ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తానని ఆయన వివరించారు. ఆలయంలోనే హరిముకుంద్ పండాతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం కాశీబుగ్గ ఆలయ పరిసరాలను పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ ఆవరణలోనే హరిముకుంద్పండా కూడా ఉన్నారు.


