కటారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరి
చిత్తూరు తొమ్మిదవ అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
కాకతీయ, ఏపీ బ్యూరో : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో చిత్తూరులోని తొమ్మిదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ 2025, అక్టోబర్ 31న శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన చంద్రశేఖర్ అలియాస్ చింటు (A1), వెంకటాచలపతి అలియాస్ ములబగిలు వెంకటేష్ (A2), జయప్రకాష్ రెడ్డి (A3), మంజునాథ్ (A4), మరియు వెంకటేష్ అలియాస్ గంగన్నపల్లి వెంకటేష్ (A5) లకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచింది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా ఉన్నారు. మిగిలిన నిందితులపై (A6 నుండి A23 వరకు) ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది.
ఇదీ కేసు నేపథ్యం…
2015 నవంబర్ 17న చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోనే మేయర్ అనురాధ మరియు ఆమె భర్త మోహన్‌లను దుండగులు కాల్పులు జరిపి, కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన సూత్రధారి: మృతుడు కటారి మోహన్ మేనల్లుడు అయిన చంద్రశేఖర్ అలియాస్ చింటు ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. రాజకీయ, వ్యక్తిగత విభేదాలు, ఆస్తి తగాదాలు హత్యకు కారణమని విచారణలో తేలింది. దాదాపు పదేళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పుతో బాధితుల కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చిత్తూరు కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


