- రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రామారావు
- అవినీతి ఆరోపణలతో గతంలోనూ సస్పెన్షన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు రామారావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రసాదాల మెషీన్ల మెయింటెనెన్స్ బిల్లుగా రూ.11.50 లక్షలు రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ నుంచి 20 శాతం కమీషన్ కోరాడు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి మెడ్‌ప్లస్ వద్ద రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ టీం అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర ఆధ్వర్యంలో రామారావు కార్యాలయంలో సోదాలు జరిపి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యి మూడు నెలల క్రితం తిరిగి డ్యూటీకి వచ్చిన రామారావు.. ఇటీవల ఎండోమెంట్ ఎస్‌ఈగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే .
సంచలనం సృష్టించిన ఘటన
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్‌రెడ్డి అనే కాంట్రాక్టర్లు గత సంవత్సరం ఆలయంలోని లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల నిర్వహణ టెండర్‌ను రూ. 10 లక్షలకు దక్కించుకున్నారు. అయితే.. గత సంవత్సర కాలంగా వారికి రావాల్సిన బిల్లులు మంజూరు కాలేదు. దీంతో ఉపేందర్, సందీప్‌రెడ్డి ఈఈ రామారావును బిల్లుల కోసం కొన్ని నెలలుగా కోరుతున్నారు. ఈఈ రామారావు బిల్లులు మంజూరు చేయడానికి గాను.. మొత్తం రూ. 10 లక్షల బిల్లులలో రూ. 2 లక్షలు తనకు లంచంగా ఇవ్వాలని నిస్సిగ్గుగా డిమాండ్ చేశారు. చివరకు రూ. 1.90 లక్షలకు బేరం కుదిరింది. కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే ఏసీబీ అధికారులకు చేరవేశారు. ఇవాళ రూ. 1.90 లక్షలు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు


