- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
- మధిరలో విద్యుత్ రంగం ఆధునీకరణకు నాంది
- రూ.27.76 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులకు శంకుస్థాపన చేసిన విక్రమార్క
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా మధిర ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా దిశగా చర్యలు చేపట్టామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మధిర పట్టణంలో రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం నెరవేరాలంటే విద్యుత్ శాఖ చాలా కీలకమని, ప్రతి రంగ అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కీలకమని అన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని పాలసీలను రూపొందించుకొని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మధిర సబ్ స్టేషన్ నుంచి ఆత్కూరు రింగ్ రోడ్డు, విజయవాడ రోడ్డు లోని హెచ్.పి. గ్యాస్ గోడౌన్ (రెండు వైపులా), వైయస్సార్ విగ్రహం నుండి అంబర్ పేట చెరువు వరకు ప్రస్తుత 11 కేవీ ఓవర్ హెడ్ లైన్లను భూగర్భంలో మార్చుటకు ప్రతిపాదించామని, నందిగామ బైపాస్ రోడ్డు హెచ్.పి. పెట్రోల్ బంకు నుండి డంప్ యార్డ్ వరకు భూ గర్భ విద్యుత్తు లైన్ పనులు ప్రతిపాదించామని అన్నారు.
విద్యుత్ అంబులెన్స్ లను ట్రాన్స్ ఫార్మర్ తో సహా అవసరమైన సామాగ్రి, టెక్నిషియన్స్ తో ఏర్పాటు చేశామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక విద్యుత్ అంబులెన్స్ అందుబాటులో ఉండాలని అన్నారు. విద్యుత్ సమస్యలపై 1912 ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే హాజరు కావడం జరుగుతుందన్నారు. ఇందిరా గిరి జల వికాసం కింద సోలార్ పంప్ సెట్ల ద్వారా సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ పెంపు లక్ష్యంగా ప్రత్యేక పాలసీ తీసుకొని వచ్చామని, మహిళా సంఘాలతో రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీ డీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల సంస్థ అభివృద్ధి చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్ అండ్ డీ ఈఈ తానేశ్వర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


