- కమీషన్ల కోసం పనిచేసే మంత్రులను బర్తరఫ్ చేయాలి
- గెలిచివస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డిని మోసం చేశారు
- ఆర్ ఎల్ డీ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్
కాకతీయ, ఖమ్మం టౌన్ : కమీషన్ల కోసమే పనిచేసే మంత్రులను బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర సోమవారం ఖమ్మంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయని వారు నేడు మంత్రులుగా కమీషన్ల కోసమే పని చేస్తున్నారని వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికై 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేయాలన్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో 25శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్నారు. రాజీవ్ యువవికాసం పేరిట 5 లక్షల మంది నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. అంబేద్కర్ అభయహస్తం పేరిట దళితులకు 12 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు తులం బంగారం, గృహలక్ష్మీ పథకం క్రింద రూ. 2500లు చెల్లించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని, మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర ఖమ్మం చేరుకుందని, మిగతా జిల్లాల్లో కూడా ఈ యాత్ర కొనసాగుతుందని తెలియజేశారు. పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళ నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధికార ప్రతినిధి గౌర బీరప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోత్కూరి వెంకటాచారి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గంట్యాల నరసింహారావు, కార్యదర్శి నూనె భాస్కరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కె జానీ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.


