- గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జిల్లాలో గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి విద్యా ప్రమాణాల పెంపు మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. గురువారం పాల్వంచలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల(బాలుర)ను సందర్శించిన ఆయన పాఠశాల విద్యా కార్యక్రమాలు వసతుల పరిస్థితి విద్యార్థుల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్ నుండి విద్యార్థుల హాజరు వసతి గృహాలు భోజనశాల క్రీడా వసతులు అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులు స్వయంగా మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారా పర్యావరణ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. కిచెన్ గార్డెన్ ద్వారా పాఠశాల భోజనశాలకు తాజా కూరగాయలు లభిస్తాయని చెప్పారు. పాఠశాల పరిసర భద్రత దృష్ట్యా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల మైదానాన్ని ఆటల కోసం అభివృద్ధి చేయాలని విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీసే దిశగా తగిన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్శన సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున విద్యార్థులకు టేబుల్ టెన్నిస్ ఆట సామాగ్రి, క్రీడా పరికరాలను అందజేశారు.
అనంతరం కలెక్టర్ స్వయంగా టేబుల్ టెన్నిస్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. గిరిజన గురుకుల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణ అవగాహన వంటి అంశాల్లో కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పాఠశాలలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా మారాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్యా విధానం గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తును మారుస్తోందని, జిల్లా యంత్రాంగం విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన ప్రతి సదుపాయం కల్పించేందుకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి రీజినల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


